‘‘ ఈ ఏడాది జూలైలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, లోక్ సభ ఎన్నికలు కూడా ముందస్తుగా వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ ఇదే జరిగితే శాసనసభ ఎన్నికలు కూడా ముందస్తుగా రావచ్చు. అలాంటప్పుడు ఎన్నికలకు మూడు, నాలుగు నెలలకు మించి సమయం ఉండదు. కాబట్టి ఈలోపు ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి, ఇతర సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో వేగం పెంచాలి, అనుకున్న సమయంలోగా వాటిని పూర్తి చేసేలా పనిచేయాలి ’’ అని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ లో టిఆర్ఎస్ పార్టీ ముఖ్యుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో రానున్న రాజకీయ పరిణామాలను, భవిష్యత్ కార్యాచరణను చర్చించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడారు……
see also:పక్కా ప్రణాళికలతో ప్రభుత్వ పథకాలు పూర్తి చేయాలి..!!
‘‘ ఇటీవల నిర్వహించిన పలు సర్వేల్లో రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. టిఆర్ఎస్ పార్టీకి ప్రస్తుత రాజకీయ వాతావరణం పూర్తిగా అనుకూలంగా ఉంది. ముఖ్యమంత్రి నాయకత్వం పట్ల, ముఖ్యమంత్రి నాయకత్వంలో తీసుకొచ్చిన పథకాల పట్ల రాష్ట్ర ప్రజల్లో చాలా సానుకూలత వ్యక్తమవుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిఆర్ఎస్ పార్టీకి 110 అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేలు స్పష్టంగా చెబుతున్నాయి. పార్టీకి అనుకూలంగా ఉన్న ఈ రాజకీయ వాతావరణాన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు తమకు వ్యక్తిగతంగా కూడా అనుకూలంగా మార్చుకోవాలి. కార్యకర్తలకు, ప్రజలకు మధ్య ఉన్న గ్యాప్ ను సరి చేసుకోవాలి. పాత, కొత్త నాయకుల మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించుకోవాలి. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అందరికీ అందేలా కృషి చేయాలి. ముఖ్యంగా మిషన్ భగీరథ పథకం కింద అక్టోబర్ 11 నాటికి ప్రతి ఇంటికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సురక్షిత నీరు అందేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలి. రైతు బంధు, రైతు బీమా పథకాల ద్వారా ప్రతి రైతుకు లబ్ది చేకూరేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలలో వేగం పెంచాలి. ఈ రాజకీయ అనుకూల వాతావరణాన్నినాయకులు తమకు అనుకూలంగా మార్చుకోవాలి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నాయకులంతా సమన్వయంతో పనిచేసి 12 అసెంబ్లీ స్థానాలను, రెండు పార్లమెంట్ స్థానాలను ప్రజల ఆశీర్వాదంతో గెలుచుకుని ముఖ్యమంత్రి కేసిఆర్ కు కానుకగా ఇవ్వాలి ’’ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో తెలిపారు.