ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తణుకు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వర్షం నిరంతరాయంగా కురుస్తున్నా లెక్కచేయకుండా వైఎస్ జగన్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజలు సైతం వర్షంలో తడుస్తూనే జననేతను కలవడానికి భారీగా తరలి వచ్చారు.. అయితే ఈ పాదయాత్రలో విశేష ప్రజా స్పందన వచ్చిందని, దీనిని చూసి అధికార టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని వైసీపీ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. జగన్ పాదయాత్రకు వచ్చిన జన ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారని అన్నారు. గురువారం తణుకులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కారుమూరి మాట్లాడారు.
see also:అవినీతి కేసుల నుంచి బయటపడేందుకే జగన్ పాదయాత్ర..!
జగన్ పాదయాత్రకు జనస్పందన లేదని స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎమ్మెల్యే సొంత ఊరు వేల్పూరులో జనసందోహాన్ని చూసి మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరిగిన పాదయాత్రకు వచ్చిన జన సందోహానికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. వేల్పూరులో ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస ప్రాంతం నుంచి గ్రామం దాటేందుకు సుమారు మూడు గంటల సమయం పట్టిందని గుర్తు చేశారు. నవనిర్మాణ దీక్షలకు జనస్పందన లేకపోవడం చూసి ఎమ్మెల్యే ఈ విధంగా పొరబడి ప్రజా సంకల్పయాత్రను విమర్శిస్తున్నారని చెప్పారు.