ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు అభినందిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. కానీ కాంగ్రెస్ నేతల కంటికి ఇవి కనిపించడం లేదని, దీనిని ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు పథకాన్ని రాబంధు పథకమనడంపై మండిపడ్డారు. ఒక జాతీయ పార్టికి రాష్ట్ర అధ్యక్షుడు, గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు పథకం రాబంధు పథకం ఏ విధంగా అవుతుందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
వ్యవసాయ రంగానికి గడిచిన నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా తెలంగాణ ప్రభుత్వం కార్యక్రమాలు చేసిందని ఉపముఖ్యమంత్రి కడియం అన్నారు. వ్యవసాయానికి రైతుకు రుణమాఫీ చేశామని, 24 గంటల కరెంటు, విత్తనాలు, ఎరువులు అందుబాటులో పెట్టామని, నీటి తీరువా రద్దు చేశామని, రైతు పెట్టుబడి కింద 4000 రూపాయలను ఇప్పటికే అందించామన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి రైతుకు రైతు బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. ఇన్ని రకాల రైతు కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్రం దేశంలో ఉందా? అని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలివితక్కువగా మాట్లాడొద్దని, ఎదిగిన నాయకత్వం అవగాహనతో మాట్లాడాలని సూచించారు. కొంతమంది విద్యావ్యవస్థను నాశనం చేశారని మాట్లాడుతున్నారని, గతంలో విద్యావ్యవస్థను నాశనం చేసిన వారు ఇలా మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు.
ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలని కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు చేపడుతారు, నియామకాలు చేపడితే వారి అనుబంధ విద్యార్థి సంఘం నేతలు కోర్టుకెళ్లి స్టేలు తెస్తారని ఉపముఖ్యమంత్రి కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డబుల్ గేమ్ లు ఎందుకని ప్రశ్నించారు. ప్రాజెక్టులు కట్టాలంటారు, కడుతుంటే అడ్డుకునే విధంగా స్టేలు తెస్తారని దుయ్యబట్టారు. రైతులను ఆదుకోవాలని చెప్పే కాంగ్రెస్ నేతలు..రైతుబంధు పథకం తెస్తే దానిని రాబంధు పథకమంటారా? అని ప్రశ్నించారు. గతంలో మేం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి, అక్రమాలకు పాల్పడినం, దీనికి మాకే పేటెంట్ ఉంది కాబట్టి మాలాగే ఇప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేస్తుందేమోనని భ్రమల్లో ఉన్నారన్నారు. కానీ అలాంటి తప్పు పనులు మేం చేయమన్నారు. ప్రజల పక్షానా ప్రజలకు ఉపయోగపడే పనులే చేస్తామని చెప్పారు. ప్రతి విషయం చిల్లరగా మాట్లాడి నవ్వుల పాలు కావద్దని సలహా ఇచ్చారు. 2019లో అధికారంలోకి వస్తారని అనుకుంటున్నారని, కానీ అది కల అని, ఎప్పటికీ నిజం కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి మంచి సలహా ఇవ్వండని, ప్రతిది రాజకీయ కోణంలో ఆలోచించి విమర్శించడం మంచిదికాదని ఉత్తమ్ కుమార్ రెడ్డికి సలహా ఇచ్చారు.