తెలంగాణలో వరంగల్ జిల్లా, మామునూరులోని వెటర్నరీ కాలేజీలో ఈ ఏడాది అడ్మిషన్లు ప్రారంభించేందుకు అనుమతులు వెంటనే మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు బండ ప్రకాశ్, ప్రొఫెసర్ సీతారాం నాయక్, ప్రభుత్వ సలహాదారుడు రామచంద్రుడు ఐఎఎస్ (రిటైర్డ్) ఈ రోజు ఢిల్లీలో కేంద్ర పశు సంవర్ధక శాఖ కార్యదర్శి తరుణ్ శ్రీధర్ ను కలిసి విజ్ణప్తి చేశారు.
ఈ పశు వైద్యశాలలో బోధనా సిబ్బంది 15 మంది ఇప్పటికే ఉండగా, మరో 85 మంది నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చామని త్వరలో భర్తీ చేయనున్నట్లు వివరించారు. వెంటనే కాలేజీ నడపడానికి వీలుగా 24వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భవనాన్ని కిరాయికి తీసుకున్నామన్నారు. వెటర్నరీ యూనివర్శిటీ ఈ కాలేజీలో ల్యాబ్ పరికరాలు కొనుగోలుచేసేందుకు అనుమతి ఇచ్చిందని, వెంటనే తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు ,పశు సంవర్ధన శాఖకు కొనుగోలు బాధ్యతలు అప్పగించామన్నారు.
కాలేజీకి శాశ్వత భవనం, హాస్టల్ భవనాలకు గత ఏడాది డిసెంబర్ 11వ తేదీన శంకుస్థాపన చేసుకుని, పనులు వేగంగా చేస్తున్నట్లు వివరించారు. ఈ కాలేజీ ఏర్పాటుకు భవనాలు, హాస్టళ్లు, ఇతర మౌలిక వసతుల కోసం ప్రభుత్వం 208 కోట్ల రూపాయలను మంజూరు చేసి, ఇప్పటి వరకు 109 కోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు. ఈ కాలేజీలో బోధనాసుపత్రి కూడా ఏర్పాటు జరుగుతోందన్నారు. ఈ కాలేజీ ఏర్పాటుతో నేరుగా 250 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రాగా…పరోక్షంగా వందలమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని, ఈ సంవత్సరం 50 మంది విద్యార్థులతో అడ్మిషన్లు చేసుకునేందుకు కావల్సిన ఏర్పాట్లన్ని పూర్తి చేశామని, అనుమతులు వెంటనే ఇవ్వాలని కోరారు.