తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సందర్షకుల తాకిడి రోజు రోజుకు ఎక్కువవుతోంది. ఈ రోజు హెలికాప్టర్ లో తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో ఉన్నతాధికారులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్షించారు. ఈ బృందంలో తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో ఛైర్మన్ అండ్ ఎండీ ప్రభాకర్ రావు, టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు, టీఎస్ ట్రాన్స్ కో ఫైనాన్స్, కమర్షియల్, హెచ్ఆర్డీ జేఎండీ, సి.శ్రీనివాస రావు, టీఎస్ ట్రాన్స్ కో ట్రాన్స్ మిషన్ డైరెక్టర్ జగత్ రెడ్డి, టీఎస్ ట్రాన్స్ కో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ డైరక్టర్ జే. సూర్యప్రకాష్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి ఉన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతితో పాటు, అక్కడ ఏర్పాటు చేస్తోన్న విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. తొలుత మేడిగడ్డ పంప్ హౌస్ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. ఆతర్వాత అక్కడ నిర్మిస్తోన్న సబ్ స్టేషన్ నిర్మాణ పనులు పరిశీలించారు. వేగంగా పనులు పూర్తి చేయాలని తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. జులై వారంలోగా విద్యుత్ సరఫరా జరిగేలా ఈ సబ్ స్టేషన్ ను సిద్ధం చేయనున్నట్లు సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. ఆ తర్వాత విహంగ వీక్షణం ద్వారా అన్నారం, సుందిళ్ల బ్యారేజి పనులను ఈ బృందం పరిశీలించింది.
అక్కడి నుంచి ప్యాకేజి -6 లో ఉన్న గ్యాస్ ఇన్స్ లేషన్ సబ్ స్టేషన్ పనుల పురోగతిని వారు సమీక్షించారు. ఈ నెలాఖరులోగా సబ్ స్టేషన్ పనులు పూర్తి చేసి.. విద్యుత్ సరఫరాకు సిద్ధం చేస్తామని సీఎండీ ప్రభాకర్ రావు హమీ ఇచ్చారు. ఈ పరిశీలన అనంతరం ప్యాకేజి -8 లో జరుగుతున్న పనులను వారు పరిశీలీంచారు. ప్యాకేజి -8 లోని విద్యుత్ సబ్ స్టేషన్ సైతం ఈ నెలాఖరులోగా అందుబాటులోకి తెస్తామన్నారు. ట్రైల్ రన్ కు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ లకు అవసరమైన విద్యుత్ సరఫరా, సబ్ స్టేషన్ల నిర్మాణం, వాటి నిర్వహణను తమ శాఖ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేస్తోందని తెలంగాణ ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు చెప్పారు.