ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ముగించుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, మంగళవారం జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో మైలవరం నియోజకవర్గ ప్రజలు వారి వారి సమస్యలను జగన్‌కు స్వయంగా చెప్పుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు తమకు పింఛన్ రావడం లేదని, నిరుద్యోగులు అయితే, చంద్రబాబు సర్కార్ ఉద్యోగాల నోటిఫికేషన్లు వదలడం లేదని, రుణమాఫీ, డ్వాక్రా రుణాలు ఇలా వారి వారి సమస్యలను వైఎస్ జగన్ తో చెప్పుకుంటున్నారు.
కాగా, మైలవరంలో బుధవారం జరిగిన ప్రజా సంకల్ప యాత్ర బహిరంగ సభలో వైసీపీ నేత జోగి రమేష్ మాట్లాడుతూ.. నేటి ప్రధాని నరేంద్ర మోడీని, నాటి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఎదిరించిన నాయకుడు ఒక్క జగనే అని అన్నారు. కేవలం మైలవరం నియోజకవర్గం మాత్రమే కాదు.. కృష్ణా జిల్లాలో ఉన్న 17 అసెంబ్లీ సీట్లను వైసీపీకే వచ్చేలా నిరంతరాయంగా కృషి చేస్తానని చెప్పారు జోగి రమేష్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు మళ్లీ అమలు కావాలంటే… వైఎస్ జగన్ సీఎం కావాలని, జగన్‌ను సీఎం చేసే బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు.