రైల్వేశాఖలో ఉద్యోగాల కొలువుల జాతర కొనసాగుతోంది. ఇటీవల విడుదల చేసిన 90,000 ఉద్యోగాలకు అదనంగా మరో 20,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం తెలిపారు. రైల్వే పోలీస్ ఫోర్స్ (ఆర్పీయఫ్)లో 9వేలు, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్‌ఫోర్స్ (ఆర్పీఎస్‌యఫ్)లో 10వేలకు పైగా పోస్టులు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ ఖాళీలకు సంబంధించిన అధికారిక ప్రకటన మే నెలలో రానుందని పేర్కొన్నారు. .తాజా ప్రకటనతో భర్తీ చేయనున్న మొత్తం ఉద్యోగాల సంఖ్య 1.10 లక్షలకు చేరుతుందన్నారు. ‘రైల్వేశాఖ దేశంలోని యువత కోసం 1.10 లక్షల ఉద్యోగాలను ప్రకటించింది. ఇప్పటికే ప్రకటించిన గ్రూప్ సిలోని అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నికల్ (26,502), గ్రూప్ డి లోని(62,907) పోస్టులకు ఆన్‌లైన్లో దరఖాస్తు గడువు ఈ నెల 31 తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకూ రెండు కోట్ల దరఖాస్తులు అందినట్లు రైల్వే అధికారుల సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్దదైన భర్తీ ప్రక్రియ మరింత విస్తృతమయింది’ అని గోయల్ ట్వీట్‌చేశారు. ఆర్పీఎఫ్, ఆర్పీఎస్‌ఎఫ్ ఉద్యోగాల భర్తీకి ఈఏడాది మేలో నోటిఫికేషన్ జారీచేస్తామన్నారు.