మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డికి హైదరాబాద్ నాంపల్లి ఎరమంజిలి కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు తెలిసింది. వైసీపీ నాయకురాలు ఎమ్మెల్యే ఆర్‌కే రోజా పై గతంలో ఆనం వివేకానందరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన కొత్తలో ఆనం వివేకానందరెడ్డి వైసీపీ నేతల పై తెగ విరుచుకుపడేవారు. ఆ క్రమంలో రోజాను టార్గెట్ చేసుకుని ఆనం వివేకానందరెడ్డి అనుచితంగా మాట్లాడారు. వివేకానందరెడ్డి వ్యాఖ్యల పై రోజా స్పందిస్తూ క్షమాపణ డిమాండ్ చేశారు. అయితే ఆనం ఆ తర్వాత కూడా అనుచితమైన రీతిలోనే మరోసారి రెచ్చిపోయారు.
దీంతో ఆ వ్యాఖ్యలు తన పరువుకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ వివేకానంద రెడ్డిపై ఎమ్మెల్యే రోజా ఎరమంజిలి కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ సాగిస్తూ వస్తోంది. దీనికి సంబంధించి వివేకానందరెడ్డి వాయిదాలకు హాజరు కాకపోవడం, వెళ్లనందుకు సరైన సమాధా నం కోర్టుకు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన కోర్టు ఆనంకు అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన సోమవారం కోర్టుకు హాజరు కానున్నట్లు సమాచారం. గత కొన్నాళ్లుగా వివేకానందరెడ్డి మీడియా ముందు కనిపించడం లేదు. ఒకదశలో తన తీరుతో అనునిత్యం వార్తల్లో ఉండిన వివేకానందరెడ్డి ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారనే మాట వినిపిస్తోంది. దీంతో ఆయన ఇంటికే పరిమితం అవుతున్నారట. ఇలాంటి నేపథ్యంలో గతంలో చేసిన వ్యాఖ్యలు అరెస్టు వారెంట్ వరకూ రావడం గమనార్హం.